వెలిగే సూర్యుడు నాన్న!

సూర్యుడు ఈ సృష్టికి వెలుగు పంచేవాడు. ఉదయాన్నే లేలేత ఎండతోనూ, మధ్యాహ్నం భగభగ మండే ఎండతోనూ, సాయంత్రానికి చల్లబడి మెల్లిగా తన ప్రతాపం తగ్గిస్తూ ఉంటాడు. కానీ సూర్యుడు రాత్రి పూట కూడా తన పని తాను చేస్తూ ఉంటాడు. అయితే అది మనకు కనిపించదు. దాన్ని చీకటని, రాత్రి అని, ఇంకా వేరే వేరే పేర్లు పెట్టుకుంటాము. ఈ భూమండలం పెద్దది కాబట్టి సూర్యుడు మరొకవైపుకు వెళ్ళినప్పుడు ఆ వెలుగు మనకు కనిపించదు. బహుశా దీన్ని అవతలి కోణం అని కూడా అనచ్చేమో.

ఇప్పుడు సూర్యుడి గురించి ఎందుకు?? అని అందరికీ సందేహం వస్తుందేమో కానీ మన ఇంట్లో నాన్న కూడా సూర్యుడి లాంటివాడే. నాన్న ప్రేమ ఉదయాన్నే సూర్యుడి వెలుగులా ఉంటుంది. నాన్న కోపం మధ్యాహ్నపు ఎండలా ఉంటుంది. నాన్న కష్టం అస్తమిస్తున్న సూర్యుడిలా నిశ్శబ్దంగా ఉంటుంది. నాన్న ఓర్పు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే సూర్యుడి గమనంలా ఉంటుంది. 

నాన్నంటే!!

నాన్నంటే ఓ ధైర్యం, ఓ భరోసా, ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తూ అందరి బాధ్యత మోస్తూ నిత్యం వెలిగే సూర్యుడి లాంటి వాడు నాన్న. అమ్మను అమ్మ ప్రేమను ఎప్పుడూ బయట పెడుతూ ఉంటాము. అమ్మను దేవతతో పోల్చి గొప్పగా పొగుడుతూ ఉంటాము. కానీ నాన్న విషయంలో మాత్రం అంతగా బయటకు చెప్పము. నాన్న ఎంత గొప్ప వాడు అయినా పిల్లల ముందు ఓడిపోవడానికే ఇష్టపడతాడు. అమ్మ ప్రేమ అమ్మ త్యాగం ఎప్పటికప్పుడు బయటకు కనిపించేవి అయితే నాన్న ప్రేమ, నాన్న త్యాగం కనిపించని ప్రాణవాయువు లాంటివి. గాలి కంటికి కనిపించదు కానీ అది లేకుంటే సమస్ధానికి మరణమే గతి. అలాగే నాన్న ప్రేమ, నాన్న త్యాగం బయటకు కనిపించవు కానీ నాన్న లేకుంటే ఏ కుటుంబం నిశ్చింతగా ఉండదు.

నాన్న ఎందుకో చిన్నబోయాడు!!

అమ్మ నవమాసాలు మోస్తుంది, నొప్పులు భరించి బిడ్డలకు జన్మనిస్తుంది. పాలిస్తుంది,. తన కొంగు వెనుక దాచుకుని పెంచుతుంది. ఇల్లాలకు ఏదైనా అవసరం వస్తే మొదట అమ్మ దగ్గరకే వెళ్తారు, బడి వయసు వచ్చేదాకా అమ్మ చేతుల్లోనే ఉంటారు పిల్లలు. అందుకే అమ్మకు దగ్గరగా ఉంటారు. నాన్నంటే అదొక భయం. ఉదయం లేచి ఏదో తిని, క్యారియర్ లో కట్టుకుని ఉద్యోగానికి వెళ్ళిపోయి ఎప్పుడో సాయంత్రం చీకటిపడే ముందు నాన్న ఇంటికి చేరుకుంటాడు. పాపం తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డల్ని ప్రేమగా ఎత్తుకోవాలని, ముద్దాడాలని అనుకుంటాడు. కానీ ఇంట్లో పిల్లలు అలసిపోయి అన్నం తిని నిద్రపోతూ ఉంటారు. చిన్న పిల్లలు అంటే నిద్రలోనే ఎక్కువ గడుపుతారు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక వాళ్ళు బడికి అలవాటు పడ్డాక, నాన్నలో ఆశ మొలకేస్తుంది. నా బిడ్డ మంచి స్థాయికి చేరుకోవాలి అని. అందుకే బాగా చదువుకోవాలని, మంచి మార్కులు రావాలని కొప్పడతాడు, అప్పుడప్పుడూ దెబ్బ వేస్తాడు. కోపం వెనుక, దెబ్బల వెనుక ప్రేమను అర్థం చేసుకోవడం మనవల్ల కాదప్పుడు. అందుకే అందరి మనసుల్లో నాన్న ఒక విలన్ లాగా ముద్రించుకుపోయి వెనుకబడ్డాడు. అన్ని విషయాల మెజ్నదు ప్రాధాన్యత లేని వ్యక్తిలా కనిపిస్తాడు.

నాన్నకు ఒక ఉత్తరం!!

ఓ పాతికేళ్ల వ్యక్తితో తన తండ్రికి ఉత్తరం రాయమంటే ఏమి రాయాలి అనే నిర్లక్ష్య సమాధానం వస్తుందేమో, కానీ తండ్రి స్థానానికి మారిన తరువాత అదే వ్యక్తితో ఉత్తరం రాయమని చెబితే తప్పకుండా ఎంతో బావిద్వేగంతో కూడుకున్న ఉత్తరం రాస్తాడు. అవును మరి బాధ్యత మీద పడితే తప్ప నాన్న సంఘర్షణ, నాన్న ప్రేమ, నాన్న ఆరాటం, నాన్న ఆశ, నాన్న త్యాగం ఇవ్వేమీ తెలిసిరావు. 

ఎప్పుడూ అమ్మ అమ్మ అమ్మ అని అమ్మకోసమే కాదు ఆకాశమంత వ్యక్తిత్వం కలిగి, నిశ్శబ్దంగా తన పిల్లలకోసం తలవంచే నాన్న కోసం కూడా కొద్దిగా సమయం కేటాయించండి.

అమ్మ అనే పదాన్ని కలుపుకున్నంత సులభంగా నాన్న అనే పదాన్ని కలుపుకోలేం మరి.

                                ◆వెంకటేష్ పువ్వాడ.